Who is Allah? Understanding God in Islam - అల్లాహ్ ఎవరు? ఇస్లాంలో దేవుడిని అర్థం చేసుకోవడం ?


 auzubillah minashaitan nirajeem, bismillahir rahmanir rahim

Quran 1:2 అల్లాహ్ - ఆయన సమస్త లోకాలకు పోషకుడు

2:22 - ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి.

2:23 - మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానముంటే, అటువంటిదే ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే (ఈ పని కోసం) అల్లాహ్‌ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి.

2:117 - భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని 'అయిపో' అని అంటే చాలు, అది అయిపోతుంది.

2:163 - మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.

2:164 - భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్‌ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.

2:165 - కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).

5:72 - “అల్లాహ్‌ (అంటే) మర్యమ్‌ కుమారుడగు మసీహ్‌యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్‌ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.

5:73 - “అల్లాహ్‌ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.

5:74 - వారు అల్లాహ్‌ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా.

5:75 - మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!

5:76 - వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్‌ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.

5:77 - వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్‌ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.

4:170 - ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను.

37:158 - ఆఖరికి వారు అల్లాహ్‌కు - జిన్నాతులకు మధ్య కూడా బంధుత్వ సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి తాము (ఇలాంటి మిథ్యా విశ్వాసం గలవారు శిక్ష నిమిత్తం) హాజరు పరచబడతామన్న సంగతి స్వయంగా జిన్నాతులకు కూడా తెలుసు.

37:159 - (అల్లాహ్‌ విషయంలో) వారు చెప్పే విషయాలకు అల్లాహ్‌ పవిత్రుడు.

2:252 - ఇవి అల్లాహ్‌ ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. (ఓ ముహమ్మద్‌!) నిస్సందేహంగా నువ్వు దైవసందేశహరులలోని వాడవు.

2:253 - వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్‌ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్‌ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్‌యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్‌ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్‌ మాత్రం తాను తలచిందే చేస్తాడు.

2:254 - ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు.

2:255 - అల్లాహ్‌ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.

2:256 - ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్‌ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.

112: 1-4 - (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు., అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు)., ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు., ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

6:14 - “ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు).

3:64 - (ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ''ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.'' ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ''మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని వారికి చెప్పేయండి.

57:1-6 - ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన గొప్ప శక్తిశాలి, వివేచనాశీలి. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు. ఆయనే మొదటివాడు, చివరివాడు. ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. భూమ్యాకాశాల సార్వ భౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు (తీర్పు నిమిత్తం) ఆయన వైపుకే మరలించబడతాయి. ఆయనే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తున్నాడు, మరి ఆయనే పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. ఆయన గుండెల్లోని గుట్టును (సయితం) బాగా ఎరిగినవాడు.

2:20 - మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా! అన్నట్టుంది వారి పరిస్థితి. అవి (మెరుపు తీగలు) వెలుగును విరజిమ్మినపుడల్లా వారు అందులో కొంతదూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారి వినేశక్తినీ, కంటిచూపునూ పోగొట్టేవాడే, నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం గలవాడు.

6:59-60 - అగోచరాల తాళం చెవులు, (ఖజానాలు) అల్లాహ్‌ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‌కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలీకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా - పచ్చిది, ఎండినది ఏది పడినా - స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. ఆయనే రాత్రిపూట (ఒకింత) మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన నిర్థారిత సమయాన్ని పూర్తిచేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆ యన మీకు తెలుపుతాడు.

58:1 - నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.

1:1 - అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ

6:1-7 - ప్రశంసలు, పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లనూ, వెలుగునూ తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు. ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్థారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్‌ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు! ఆకాశాలలోనూ, భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేదీ, పైకి వ్యక్తపరచేదీ - అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే. వారి వద్దకు వారి ప్రభువు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దానిపట్ల వారు విముఖతే చూపుతున్నారు. తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి. ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుద ముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము. (ఓ ప్రవక్తా!) ఒకవేళ కాగితంపై లిఖించబడివున్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్లు తమ స్వహస్తాలతో దానిని తాకినా, “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు” అనే అంటారు అవిశ్వాసులు.

6:93-106 - అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించేవాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ 'నాపై వహీ అవతరించింది' అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్‌ అవతరింపజేసినటువంటిదే 'నేను కూడా అవతరింపజేస్తాను' అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!

మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే, మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీవెంట చూడటం లేదు! నిజంగానే వారికీ - మీకూ మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది.

నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్‌యే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు. జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్‌. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు?

ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్థారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు, మహాజ్ఞాని (అయిన అల్లాహ్‌) చేసిన నిర్థారణ.

చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.

ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము.

ఇంకా - ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును (ఆలివ్‌ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసినకాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి! నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి.

ప్రజలు జిన్నాతులను అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్లు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను, కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్లు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.

ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు.

ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే.

ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.

“నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను” (అని ఓ ప్రవక్తా! చెప్పు).

ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము- “నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు” అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరచేటందుకుగాను (మేమిలా చేస్తాము).

ఓ ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు.

6:107  وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే వారు షిర్క్‌కు ఒడిగట్టే వారే కారు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవూ కావు.
6:108  وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ

వారు అల్లాహ్‌ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్‌ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాలవారికీ వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన, వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుక పరుస్తాడు.
13:2  اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్‌ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే - ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.
13:3  وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్నిరకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి.
13:4  وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమిలో అనేక (రకాల) నేలలు ఒక దానికొకటి ఆనుకుని ఉన్నాయి. (అందులో) ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి. ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
13:13  وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ
ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్‌ విషయంలో పిడి వాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు!
13:14  لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُم بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
ఆయన్ని (అల్లాహ్‌ను) వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన రెండు చేతులనూ నీళ్ళ వైపుకు చాచి, ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. (అల్లాహ్‌ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి) ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే.
13:15  وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ ۩
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ - తమకు ఇష్టమున్నా, లేకపోయినా - అల్లాహ్‌కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సయితం ఉదయం సాయంత్రం (ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి).
13:16  قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ ۗ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ
"భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" అని వారిని అడుగు. "అల్లాహ్‌యే" అని వారికి చెప్పు. "అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని, తమ స్వయానికి సయితం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా?" అని వారిని అడుగు. "గుడ్డివాడూ - చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలూ - వెలుగూ ఒకటి కాగలవా? పోనీ, వారి దృష్టిలో 'సృష్టి' అనేది సందేహాస్పదం కావటానికి, వారు అల్లాహ్‌కు భాగస్వాములుగా చేర్చినవారుగాని అల్లాహ్‌ మాదిరిగా దేన్నయినా సృష్టించారా?" అని కూడా వారిని అడుగు. "అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధిక్యుడు" అని వారికి స్పష్టంగా చెప్పు.
13:17  أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَالَتْ أَوْدِيَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ۚ وَمِمَّا يُوقِدُونَ عَلَيْهِ فِي النَّارِ ابْتِغَاءَ حِلْيَةٍ أَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهُ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْحَقَّ وَالْبَاطِلَ ۚ فَأَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَاءً ۖ وَأَمَّا مَا يَنفَعُ النَّاسَ فَيَمْكُثُ فِي الْأَرْضِ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ
ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నదీ, ప్రతి కాలువా తన వైశాల్యాన్నిబట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ళ ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై (లోహాలపై) కూడా (ఈ విధమైన) నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్‌ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా (ఎగిరి) పోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్‌ ఉదాహరణల ద్వారా (విషయాన్ని) వివరిస్తున్నాడు.
13:18  لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ
తమ ప్రభువు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించనివారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా, దాన్నంతటినీ తమకు (విధించబడే శిక్షకు) బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ (కఠినమైన) లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం.
13:19  أَفَمَن يَعْلَمُ أَنَّمَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَىٰ ۚ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమిటీ, నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడునూ, గుడ్డివాడు ఒక్కటే అవుతారా? విజ్ఞులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
6:13  وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
రాత్రిపూట, పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్‌దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
6:14  قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
“ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు).
16:2  يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ
"నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. కనుక మీరు నాకు భయపడండి" అని ప్రజలను హెచ్చరించటానికి, ఆయనే దూతలకు తన 'వహీ'ని ఇచ్చి, తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు-
16:3  خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు.
16:4  خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ
ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు. కాని వాడు పచ్చి తగవులమారిగా తయారయ్యాడు.
16:5  وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ
ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని (పశువులు) మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి.
16:6  وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ
మీరు వాటిని మేపుకుని రావటంలోనూ, మేపటానికి తోలుకు పోవటంలోనూ అందం (కళ) ఉట్టిపడుతూ ఉంటుంది.
16:7  وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
మీరెంతో ప్రయాసపడితేగాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకునిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు.
16:8  وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ
మీరు స్వారీ చేయటానికీ, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు.
16:9  وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్‌పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే.
16:10  هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ
ఆయనే మీ కోసం ఆకాశం నుంచి నీళ్ళను కురిపిస్తున్నాడు. దాన్ని మీరూ త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను (వృక్షాలను) మీ పశువులకు కూడా మేపుతారు.
16:11  يُنبِتُ لَكُم بِهِ الزَّرْعَ وَالزَّيْتُونَ وَالنَّخِيلَ وَالْأَعْنَابَ وَمِن كُلِّ الثَّمَرَاتِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
దాంతోనే (ఆ నీటితోనే) ఆయన మీ కోసం పొలాలను పండిస్తాడు. జైతూను (ఆలివ్‌), ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
16:12  وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ఆయనే మీ కోసం రేయింబవళ్ళనూ, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి.
16:13  وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ
ఇంకా రంగురంగుల వస్తువులెన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారికోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది.
16:14  وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు - మీరు అందులో నుంచి (తీయబడిన) తాజా మాంసాన్ని తినటానికీ, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికితీయటానికీ. నీవు చూస్తావు! ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి (ఈ ఏర్పాటు చేయబడింది).
16:15  وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ
భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు.
16:16  وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ
ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు.
16:17  أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ
ఏమిటీ, (సర్వాన్నీ) సృష్టించేవాడూ - ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరూ ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా?
5:64  وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ ۚ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۚ وَأَلْقَيْنَا بَيْنَهُمُ الْعَدَاوَةَ وَالْبَغْضَاءَ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۚ كُلَّمَا أَوْقَدُوا نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ ۚ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا ۚ وَاللَّهُ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
“అల్లాహ్‌ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్‌ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు. నీపైన నీ ప్రభువు తరఫు నుంచి అవతరించిన సందేశం వారిలోని చాలా మందిలో తలబిరుసుతనాన్ని, తిరస్కారభావాన్నే వృద్ధి చేస్తుంది. ఇంకా, మేము వారి మధ్య ప్రళయదినం వరకూ విరోధం, విద్వేషం ఉండేలా చేశాము. వారు యుద్ధాగ్నిని రాజేసినప్పుడల్లా, అల్లాహ్‌ దాన్ని ఆర్పివేస్తాడు. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారు. కాగా; అల్లాహ్‌ కల్లోల జనకులను ఎంతమాత్రం ప్రేమించడు.
55:29


  يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ

ఆకాశాలలో, భూమిలో ఉన్నవారంతా (తమ అవసరాలు తీరడానికి) ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ (వినూత్న) వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు.


55:1
  الرَّحْمَٰنُ


కరుణామయుడు (అయిన అల్లాహ్)

55:2


  عَلَّمَ الْقُرْآنَ

ఖుర్ఆన్ ను నేర్పాడు.


55:3
  خَلَقَ الْإِنسَانَ


ఆయన మనిషిని పుట్టించాడు.

55:4


  عَلَّمَهُ الْبَيَانَ

ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు.


55:5
  الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ


సూర్యుడు, చంద్రుడు ఒక (నిర్ణీత) లెక్క ప్రకారం పోతున్నాయి.

55:6


  وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ

నక్షత్రాలు, వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి.


55:7
  وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ


ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు, ఆయనే (సమతూకం నిమిత్తం) త్రాసును ఉంచాడు.

55:8


  أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ

మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు!


55:9
  وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ


తూకం సరిగ్గా – న్యాయసమ్మతంగా – ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి.

55:10


  وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ

ఆయన సృష్టిరాసుల కోసం భూమిని పరచి ఉంచాడు.


55:11
  فِيهَا فَاكِهَةٌ وَالنَّخْلُ ذَاتُ الْأَكْمَامِ


అందులో పండ్లు ఫలాదులు, పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి.

55:12


  وَالْحَبُّ ذُو الْعَصْفِ وَالرَّيْحَانُ

ఊక గల ధాన్యాలు, సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి.


55:13
  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ


కనుక (ఓ మనుషులు, జిన్నులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను కాదనగలరు?

55:14


  خَلَقَ الْإِنسَانَ مِن صَلْصَالٍ كَالْفَخَّارِ

ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు.


55:15
  وَخَلَقَ الْجَانَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ


మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు.

55:16


  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు?


55:17
  رَبُّ الْمَشْرِقَيْنِ وَرَبُّ الْمَغْرِبَيْنِ


రెండు తూర్పులకు ప్రభువు (ఆయనే), రెండు పడమరలకు ప్రభువు (కూడా ఆయనే).

55:18


  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

మరైతే (ఓ మానవ, జిన్ను వర్గీయులారా!) మీరు మీ ప్రభువు యెక్క ఏ ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు?


55:19
  مَرَجَ الْبَحْرَيْنِ يَلْتَقِيَانِ


రెండు సాగర జలాలు పరస్పరం కలసి ప్రవహించేలా వదలిపెట్టినవాడు ఆయనే.

55:20


  بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ

అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది. దాన్ని అవి దాటిపోవు.


55:21
  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ


కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?

55:22


  يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَالْمَرْجَانُ

ఆ రెండింటి నుంచి ముత్యాలు, పగడాలు బయల్పడుతున్నై.


55:23
  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ


కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?

55:24


  وَلَهُ الْجَوَارِ الْمُنشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ

సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే.


55:25
  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ


కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?

55:26


  كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ

భూమండలం పై ఉన్నవారంతా నశించి పోవలసినవారే.


55:27
  وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ


ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే.

55:28


  فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు?


6:103
  لَّا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ


ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.

6:5


  فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ

తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి.


72:18
  وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا


ఇంకా – మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి.

2:165


  وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ

కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).


39:43
  أَمِ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ شُفَعَاءَ ۚ قُلْ أَوَلَوْ كَانُوا لَا يَمْلِكُونَ شَيْئًا وَلَا يَعْقِلُونَ


ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి (వేరితరులను) సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? "వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా (మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా?)?" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.

6:141


  وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ

ఆయనే పందిళ్ళపై ఎక్కించబడే తోటలను, పందిళ్ళపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంటపొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను (ఆలివ్‌), దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంటకోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్‌ ఎట్టిపరిస్థితిలోనూ ఇష్టపడడు.


6:142
  وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ


పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండేవాటినీ పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్‌ మీకు ఇచ్చిన దానిని తినండి. కాని షైతాను అడుగుజాడల్లో నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు.

6:143


  ثَمَانِيَةَ أَزْوَاجٍ ۖ مِّنَ الضَّأْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ نَبِّئُونِي بِعِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ

(ఇవి ఆయన సృష్టించిన) ఎనిమిది ఆడమగలు. అంటే గొఱ్ఱెలలో రెండు రకాలు, మేకలలో రెండు రకాలు. “అల్లాహ్‌ నిషేధించినది ఆ రెండు మగ పశువులనా లేక రెండు ఆడ పశువులనా లేక ఆ రెండు ఆడపశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.


6:144
  وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ


అలాగే ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలను (ఆయన పుట్టించాడు). మరి వీటిలో అల్లాహ్‌ నిషేధించినది రెండు పోతులనా? లేక రెండు పడ్డలనా? లేక ఆ రెండు పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా? అని (ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్‌ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారమూ లేకుండానే- ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో- అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు.

6:145


  قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ

ఓ ప్రవక్తా! వారికి చెప్పు : (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పందిమాంసం - అది పరమ అశుద్ధం గనక! - ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో- రుచికోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో) నీ ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు.


25:1
  تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا


సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్‌ గొప్ప శుభకరుడు.

17:1


  سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ

తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే; మేమతనికి మా (శక్తిసామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్‌ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.


10:18
  وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ


వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, "అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి" అని చెబుతున్నారు. "ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?" వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.

17:105


  وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا

మేము దీనిని (ఖుర్‌ఆన్‌ను) సత్యసమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము.


17:106
  وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا


నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్‌ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము.

17:107


  قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِن قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا

వారికి చెప్పు : "మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా, దీనికి పూర్వం జ్ఞానం వొసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడి పోతారు."


17:108
  وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا


"మా ప్రభువు పరమపవిత్రుడు. మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం" అని అంటారు.

17:109


  وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩

వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్‌ఆన్‌ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది.


17:110
  قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا


వారికి చెప్పు : "అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా - ఏ పేరుతో పిలిచినా - మంచి పేర్లన్నీ ఆయనవే." నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు.

17:111


  وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُن لَّهُ وَلِيٌّ مِّنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا

ఇంకా ఇలా చెప్పు: "ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూలేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు."


33:41
  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا


ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.

33:42


  وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا

ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.


53:3
  وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ


అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు.

53:4


  إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ

అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.


10:15
  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ ۙ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَٰذَا أَوْ بَدِّلْهُ ۚ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِن تِلْقَاءِ نَفْسِي ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۖ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ


వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు "ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి" అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు 'వహీ' ద్వారా పంపబడే దానిని నేను (యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను."

Comments